సామాన్యుల సొంతింటి కలను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల(Double bed room houses) నిర్మాణాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లా కేంద్రంలో 560 నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడ రోడ్లు, డ్రైనేజి, మంచినీరు లాంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. నిర్మాణాల వద్ద పర్యవేక్షణ కొరవడటంతో డబుల్ బెడ్రూం ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పేకాటరాయుళ్లు, మందు బాబులు నిత్యం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
నాణ్యతపై ఆందోళన
డబుల్ బెడ్రూం(Double bed room houses) ఇళ్ల నిర్మాణం వద్ద సూపర్వైజర్, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వల్ల ఇళ్ల డోర్లు, కిటికీలు చోరీకి గురవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆకతాయిలు కిటికీ అద్దాలు పగలగొడుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం కాకముందే.. గోడలకు బీటలు రావడంపై స్థానికులు నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి పట్టణంలో సింగన్నగూడెం ప్రాంతంలో 560 డబుల్ బెడ్రూం నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణం పూర్తి అయినా అధికారులు వాటిని పట్టించుకోకపోవడం, లబ్ధిదారులకు ఇవ్వకపోవటంతో ఆ నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అర్హులైన వారందరికీ ఈ ఇళ్లను వెంటనే అందించాలి.
-వనం రాజు, స్థానికుడు
జిల్లా వ్యాప్తంగా..
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం(Double bed room houses) ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని వివిధ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా.. జిల్లావ్యాప్తంగా 3వేల 300 డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రమే మంజూరయయ్యాని ప్రభుత్వం చెబుతోంది. 17 మండలాలకు పంచితే... గ్రామానికి రెండు, మూడు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయా పార్టీల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ అందులో ప్రధానమైన సమస్య డ్రైనేజీ. డ్రైనేజీ కోసం ఓ సెప్టిక్ ట్యాంక్ కట్టి ఆ నీటిని ఎక్కడ వదలాలో కూడా తెలియని పరిస్థితి. ఇంతవరకు ఆ పనులు చేయలేదు. దీని ద్వారా ప్రభుత్వం, అధికారులు ఏ విధంగా పని చేస్తున్నారో తెలుస్తోంది.
-అనురాధ, సీపీఎం పార్టీ నాయకురాలు
భువనగిరిలోని డబుల్ బెడ్రూం(Double bed room houses) ఇళ్లకు త్వరగా.. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని.. ఇళ్లు లేని నిరుపేదలు అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: Mission Bhageeratha leak: మిషన్ భగీరథ పైపు లీక్.. వాహనదారుల ఇబ్బందులు