Munugode Election campaign of all parties: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు కార్యక్షేత్రంలో చురుగ్గా కదలుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. జనంలోకి విస్తృతంగా వెళ్లేలా కార్యక్రమాలను చేపడుతున్నారు. పరస్పర విమర్శలు, ఆకర్షణీయమైన హామీలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
తెరాస ఇంటింటి ప్రచారం.. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు పిలుపు కోసం తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. సాధారణ కార్యకర్త మొదలు మంత్రి వరకు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రజల్లోకి వెళుతున్నారు. మర్రిగూడెం మండలం రాజుపేట తండాలో మంత్రి హరీశ్ రావు గ్రామస్థులతో సమావేశమయ్యారు. స్థానికులతో అల్పాహారం చేశారు. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చండూరు పురపాలికలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కూసుకుంట్ల గెలుపును కాంక్షిస్తూ వట్టిపల్లి రామలింగేశ్వర స్వామి గుట్టపైకి మోకాళ్లపై నడిచి కార్యకర్తలు మొక్కులు చెల్లించారు.
మునుగోడులో ప్రజాసమస్యలు పరిష్కారానికి ఏ ఒక్కరోజు రాజగోపాల్ రెడ్డి కృషిచేయలేదని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సంస్థాన్ నారాయణపూర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. నాలుగేళ్లుగా మునుగోడులో అభివృద్ధి జరగలేదని స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరారని విమర్శించారు. నారాయణపూర్ మండలం సర్వేల్‌లో యువజన, విద్యార్థి సంఘాలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదెరి కిషోర్ సమావేశమయ్యారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ గులాబీ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.
ప్రజల మీద ప్రేమ ఉంటే రాజగోపాల్‌రెడ్డి తెరాసలో చేరేవారు. భాజపాలో చేరడానికి గల ఉద్దేశ్యం ఏంటి అంటే కాంట్రాక్ట్‌ల కోసం వెళ్లారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే.. కాంట్రాక్ట్‌ల కోసమే ప్రజల దగ్గరకు ఉపఎన్నిక తీసుకొని వచ్చావు. ఈ ఎన్నికలో గెలిస్తే నీకు లాభం ప్రజలకు లాభం లేదు. మునుగోడులో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గెలవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1000కోట్లు తీసుకురాగలవా. - గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
మేము మీకే కచ్చితంగా ఓటేస్తున్నాము. ఫ్లోరైడ్ నిర్మూలన జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎన్నో వచ్చిన తరవాత మేము వేరేవాళ్లకు ఎట్లా ఓటేస్తామని మునుగోడు ప్రజలే చెప్పుతున్నారు. మా తెరాస పార్టీ నిర్వహించిన సర్వేలో 50శాతం నుంచి 60శాతం మా పార్టీ అధికారంలో ఉంటుంది. అధికారంలోకి రావడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తాము. - ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తన సొంత ఆసుపత్రికి ఆరెగూడెం నుంచి 25 మంది రోగులను బస్సులో తరలించారు. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తామని వారికి భరోసా ఇచ్చారు.తమ సమస్యలను పరిష్కరించగలిగేది కేసీఆర్ మాత్రమేనని అందుకే మునుగోడు ఓటర్లు తెరాసను గెలిపించాలని జల సాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యానారాయణ పిలుపునిచ్చారు. ఫ్లోరోసిస్ బాధితులు సైతం గులాబీ పార్టీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటన.. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బూత్ కమిటీలతోనూ సునీల్ బన్సల్ సమావేశమై పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. మునుగోడులో భాజపా అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులు, ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయావకాశాలు, ఏ మండలాల్లో అనుకూలత, ప్రతికూలత అంశాలపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాల్టీ హనుమాన్ నగర్ వద్ద రోడ్‌షోలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నాంపల్లి మండలం రేఖ్యా తండాలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. చౌటుప్పల్, గట్టుప్పల్ లో ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్ కాంగ్రెస్, తెరాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ఏమీ చేయని వారు ఇపుడేదో చేస్తామంటే జనం నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
నేతన్నలకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి. నాసిరకం మద్యం మొత్తం హైదరాబాద్‌లోనే ఉంది. కవితనే ఈ మద్యాన్ని అమ్ముతుంది. దళితులకు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి. ధరణి పోర్టల్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయి.
- అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
కాంగ్రెస్ ప్రచారం.. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కూలీలు, గిరిజన మహిళలతో కలిసి మాట్లాడారు. ఆటోలో వెళ్తున్న ప్రయాణికులకు కలుసుకుని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గట్టుప్పల్‌లోని వైద్యశాలను పరిశీలించి అక్కడి సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: