Munugode By Poll campaign ends Today : మునుగోడు ఉపఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును తెరాస, భాజపాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది.
Munugode By election campaign ends Today : తెరాస తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మునుగోడులో, ఆదివారం రోజు చండూరులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మంత్రులు మండలాలవారీగా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామలవారీగా బాధ్యతలు తీసుకొని ప్రతిఓటరను కలిశారు. వామపక్షాల బలాన్ని ఒడిసిపట్టేందుకు కూడా గులాబీపార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
40మంది స్టార్ క్యాంపెయినర్లతో భాజపా జోరుగా ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలు ఇంటింటికి తిరిగారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేశారు. కొన్నిరోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్.. సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతున్నారు. ఆమె తరుఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ప్రచారం చేశారు.
మహిళా గర్జన సభ: ఆఖరిరోజు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమించనున్నాయి. మధ్యాహ్నం సంస్థాన్‌నారాయణపూర్‌లో జరిగే రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మర్రిగూడలో మంత్రి హరీశ్‌రావు, చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు ప్రచారం నిర్వహించనున్నారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ చివరిరోజున మహిళా గర్జన సభ ద్వారా నియోజకవర్గ ప్రజల మద్దతు కోరనుంది.ఉపఎన్నిక ప్రచారం సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. అనంతరం సామాజిక మాధ్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీలు నిర్ణయించాయి. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని ఓటర్లకు సమాచారం పంపించే ఏర్పాట్లు చేశాయి.
ప్రచార గడువు ముగిసిన వెంటనే పార్టీలు తెరవెనుక మంత్రాంగానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఓటు బ్యాంకు పోకుండా చూస్తూనే, ప్రత్యర్థి పార్టీలకు పట్టున్న చోట్ల ఓటర్లను ఆకర్షించే వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓటర్లకు గాలం వేసేందుకు.. వివిధ కాలనీల్లో ఇప్పటికే ప్రత్యేకంగా దావత్‌లు ఇచ్చారు.
మద్యం, నగదు పంపిణీ చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లకు పోటాపోటీగా డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఓ ప్రధాన పార్టీ చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సోమవారం రాత్రి ఓటుకు 3వేలు, మునుగోడు మండలంలో 4వేలు చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. నిన్న రాత్రికే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బడిపిల్లల బ్యాగుల్లో డబ్బులు పంపిణీ: మరో ప్రధాన పార్టీ ఇవాళ ఉదయం నుంచి నగదు పంపకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ముందు పంపిణీ చేసిన పార్టీ కంటే వెయ్యిరూపాయలు ఎక్కువగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఓ పార్టీ ఎవరికీ అనుమానం రాకుండా బడిపిల్లల బ్యాగుల్లో డబ్బులు పెట్టి వార్డుల్లో ఉన్నవారికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మద్యం డంపులను అన్ని గ్రామాల్లోకి పార్టీల నేతలు చేరవేస్తున్నారు. ఓపార్టీ ఎవరికీ అనుమానం రాకుండా పాఠశాల బస్సులో వీటిని తరలించినట్లు తెలుస్తోంది. నిఘా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డబ్బులు ఎలా పంపిణీ చేయాలనే దానిపై ప్రధాన పార్టీలు కిందిస్థాయి నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు నిఘా ఉంటుందని.. ఒక రోజు ముందుగానే ఓటర్లకు డబ్బులివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: