మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ ఖ్యాతికి నిలువుటద్దమైన మూసీనది... కాలుష్యం కోరల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నగరవాసులకు తాగు, సాగునీరు ఇచ్చిందని... ఇప్పుడు ఆ నీరు వాడకానికి కూడా పనికిరాకుండా పోయిందని ఆరోపించారు.
కాలుష్యం బారినపడిన మూసీనదిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని.. నది పరిసర ప్రాంతాల్లో నీరు కలుషితం కాగా ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతోందన్నారు. ఆ నీటిని పంటలకు వాడడం, ఆవులకు తాగించడం ద్వారా వచ్చే ఉత్పత్తులను తినడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు వివరించారు. ప్రజల శరీరంలో హానికరమైన మినరల్స్ పేరుకుపోతున్నాయని, మూసీ పరిసర ప్రాంతాల్లో 300 నుంచి 500 అడుగులు లోతు వరకు భూగర్భ జలం కలుషితమైందని ఆందోళన వ్యక్తం చేశారు.
భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని 40కిపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, వాటి నుంచి వచ్చే హానికరమైన టాక్సిక్, వ్యర్థ పదార్థాలను ఈ నదిలోకి వదులుతున్నాయని ఎంపీ తెలిపారు. తద్వారా సూర్యాపేట జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని స్పందించి జాతీయ నదుల పరిరక్షణ పథకంలో భాగంగా నమామి గంగా తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని లేఖలో కోరారు. ఇందువల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం కాపాడిన వారవుతారని తెలిపారు.