monkeys fight: పొలం, స్థలం, సరిహద్దుల వివాదాల్లో గొడవలంటే మాములుగా ఉండదు. ఒక్కసారితో ముగిసిపోయే తంతు కాదు. అవన్నీ మనుషులు ఆస్తుల కోసం కొట్టుకునే సందర్భాలు. కానీ.. మూగజీవాలు కూడా అలాగే గొడవలకు దిగుతాయా? సరిహద్దులు సృష్టించుకుని మరీ గొడవ పడతాయా? ఇలాంటివి వాటికేం తెలుసు అనుకుంటే పొరపాటే. అవి కూడా జాగ పంచాయితీలు పెట్టుకుంటాయనటానికి ఇక్కడ జరిగిన సన్నివేశమై సాక్ష్యం.
రెండు వానరాల గుంపులు అనూహ్యంగా దాడికి దిగాయి. ఎప్పటి నుంచో గ్రామంలో ఉంటున్న కోతులు కొత్తగా వచ్చిన వానరాలపై భీకర యుద్ధం చేశాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన కోతుల దండ్లు దాదాపు రెండు గంటల పాటు తలపడ్డాయి. ఈ వింత సన్నివేశం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదంతా గమనించిన గ్రామస్థులు వాటిని తరిమేందుకు యత్నించారు. అయినప్పటికీ.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గొడవ మరింత తీవ్రతరం చేశాయి. అడవి నుంచి గుంపులుగా వచ్చిన కోతులతో.. గ్రామానికి చెందిన కోతులు గొడవ పడ్డాయి. ఈ దృశ్యాలను గ్రామ యువకులు సెల్ ఫోన్లలో బంధించి వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కోతుల గొడవ ఎంతసేపటికి సద్దుమణగక పోవడంతో గ్రామస్థులు కర్రలతో తరిమికొట్టారు. వానరాలను ఊరి నుంచి బయటకు తరిమేశారు. ఈ సంఘటనతో సరిహద్దు గొడవలు మనుషుల్లోనే కాదు... కోతుల్లో కూడా ఉంటాయని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి: కేటీఆర్‌కు నెటిజన్లు సూచించిన ఓటీటీ సినిమాలివే.. మీరు ఓ లుక్కేయండి..!
ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 50మీటర్ల దూరంలో శరీరభాగాలు!