రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో స్వచ్ఛందంగా సోమవారం నుంచి ఐదు రోజులపాటు లాక్‌డౌన్ పాటించాలని అఖిలపక్ష పార్టీ నాయకులు అంబేడ్కర్ చౌరస్తా వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. లాక్‌డౌన్ సోమవారం నుంచే పాటించాలని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు అన్ని తెరిచి ఉంచాలని సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించిన దుకాణాలు మాత్రమే రాత్రి వరకు తెరిచి ఉంచాలని కోరారు. ఈ లాక్‌డౌన్ మొదటి విడతగా ఐదు రోజుల పాటు ఉంటుందని చెప్పారు. పురపాలక వర్గం , అఖిలపక్ష నాయకులు, ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై 1000 రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు. లాక్డౌన్కు స్థానిక పోలీసు సిబ్బంది, పురపాలక సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మున్సిపాలిటీ తెరాస పార్టీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి ,కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుండగాని రామచంద్రు, సీపీఐ మున్సిపాలిటీ కార్యదర్శి మల్లేష్, సీపీఎం మున్సిపాలిటీ కార్యదర్శి కూరెళ్ల రాములు, వ్యాపార సంస్థల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి; రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్రెడ్డి