భక్తుల కొంగుబంగారంగా భావించే వెంకటాపురం లక్ష్మీనరసింహుడు విశేష పూజలందుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. తుర్కపల్లి మండలం వెంకటాపురంలోని ఇరుకైన కొండగుహలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణకాలంలో ఈకొండపై రుషులు తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహుడు జ్వాలా రూపంలో వారికి దర్శనమిచ్చేవారని భావిస్తుంటారు.

మండల దీక్షలతో సమస్యలు దూరం:
కొండగుహలో స్వయంభు ఆరాధ్యుడిగా భక్తులు భావిస్తారు. పురాణాల ఆధారంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడు అలసిపోయి అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకునేవాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. వెంకటగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయపరిసరాల్లో మండల దీక్షలు 45 రోజులపాటు చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోయి.. జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తారని అర్చకులు చెబుతున్నారు.

వైశాఖ పౌర్ణమికి వార్షిక బ్రహ్మోత్సవాలు:
స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ పౌర్ణమికి మూడు రోజుల ముందు ప్రారంభమై.. తిరు కల్యాణోత్సవం, అశేష జనవాహిని మధ్య వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో అన్నదాన కార్యక్రమాలు చేపడుతారు. కొండపైన ఓంకారం ఆకారంలో చెట్టుకొలువై ఉంది. పూర్వీకుల కాలం నుంచి వంశపారంపర్యంగా స్వామి వారి సంకల్పంతో ఇక్కడ పూజలు చేపడుతున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రమాకాంత్ శర్మ తెలిపారు.

ఆలయానికి చేరుకోండిలా..
ఎంతో మహిమ గల ఈ పురాతన ఆలయాన్ని చేరుకోవడానికి.. యాదాద్రి నుంచి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. భక్తులు కోరికలను నెరవేర్చే వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు వారి పాలిట కొంగుబంగారంగా నిలుస్తున్నారు.