మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే నియోజకవర్గంలో నేతల మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. నువ్వానేను అన్న రేంజ్లో విమర్శలు కురిపించుకుంటున్నారు. తాను కాంట్రాక్టుల కోసమే భాజపాలోనే చేరాడని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. త్వరలోనే మంత్రి అవినీతి చిట్టా బయటపెడతానని చౌటుప్పల్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
తెలంగాణ రాక ముందు ఇల్లే లేని జగదీశ్వర్ రెడ్డికి ఇప్పుడు వేయి కోట్ల ఆస్తి ఎక్కడిదని ప్రశ్నించారు. మంత్రి అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలిపారు. తాను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే మంత్రి రాజీనామా చేస్తాడా అని సవాల్ విసిరారు. తాను రాజీనామా చేసిన తరువాతే చౌటుప్పల్-సంస్థాన్ నారాయణపురం రహదారిని ఆగమేఘాల మీద వేస్తున్నారని తెలిపారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోనే రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
జగదీశ్వర్ రెడ్డిపై త్వరలోనే ఆయన ఆస్తులు ఎంతున్నాయి.. నేర చరిత్రపై ఒక పేపర్ రిలీజ్ చేస్తా.. అది తప్పని రుజువ్ చేయ్.. ఎన్నడైనా నేను కాంట్రాక్టులు పొందినట్లు, తప్పుడు మార్గంలో పనులు పొందినట్లు నువ్వు నిరూపిస్తే.. రాబోయే మునుగోడు ఎన్నికల్లో నేను పోటీ చేయను. రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే నీ బినామీ ఆస్తుల చిట్టా తీస్తా... అది తప్పని నిరూపించకపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలని మీడియా సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే