యాదాద్రి భువనగిరి జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్.డాక్టర్.ఎం.డి.శమీమ్ అక్తర్ పర్యటించారు. వారికి నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు, భువనగిరి ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి అహ్మద్ ఖాన్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు భువనగిరి కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. భువనగిరికి మంజూరైన పొక్సో కోర్టు ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
ప్రస్తుత తరుణంలో న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసుల విచారణ గురించి న్యాయమూర్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భౌతికంగా కోర్టులను ప్రారంభించినట్లయితే తలెత్తే ఇబ్బందుల గురించి న్యాయమూర్తులతో ఆయన చర్చించారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులను పరిష్కరించాలని ఆయన న్యాయమూర్తులకు సూచించారు. కోర్టు ఆవరణలో రోటరీ క్లబ్, భువనగిరి బార్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను జస్టిస్ డా.ఎం.డి.శమీమ్ అక్తర్ ప్రారంభించారు. ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్, బార్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావు నియామకం