సివిల్ సప్లై హమాలీ యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో హమాలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి అన్నపు వెంకట్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.6లక్షల ప్రమాద బీమాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వీపర్లకు కనీస వేతనం రూ.17,500 ఇవ్వాలన్నారు. హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణ పేరుతో గుర్తింపు కార్డులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా బోనస్‌గా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి రెండు జతల యూనిఫాం కుట్టుకూలి కింద 1200 రూపాయలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ పట్టణ కార్యదర్శి మల్లేష్ పులకరం, హమాలి యూనియన్ అధ్యక్షులు పురుగుల మారయ్య , పి.రమేష్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి జంగనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సిద్దిపేట జిల్లా గౌరవెల్లి పంప్‌హౌస్ పనుల్లో అపశ్రుతి