కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించక ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెంలో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి పంటను తీసుకెళ్లడం లేదని... కాంటాలు సరిగా లేవని.. సిబ్బంది కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలును ఆలస్యంగా మొదలుపెట్టారని... అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులొచ్చి కనీసం పంటలను పరిశీలన చేసింది కూడా లేదని వాపోయారు. రైతుల నిరసనకు అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్న హామీతో రైతులు ధర్నా విరమించారు.
![yadadri bhuvanagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:56:24:1619681184_tg-nlg-82-29-raithula-rastha-roko-av-ts10134_29042021122414_2904f_1619679254_764.jpg)
ఇదీ చూడండి: కరోనా విజృంభణతో మండుతున్న పండ్ల ధరలు