యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో సన్నవరి ధాన్యం పండించిన రైతన్నలు ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకానికి ఇచ్చే ధరనే ఇస్తున్నారని వాపోయారు.
సరైన గోదాములు లేక రోడ్లపైనే ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.