యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పొట్టిమర్రి చౌరస్తా వద్ద రైతు వేదిక ఆధ్వర్యంలో రైతు జిన్నా.హరినాథ్ రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గౌరాయిపల్లి చెరువులో నీటిని నింపడంతో పాటు రైతులకు సంబంధించిన మరో ఐదు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దీక్ష చేస్తున్నారు. కాల్వపల్లి వాగుపై చెక్ డ్యామ్ నుంచి గౌరాయిపల్లి చెరువులోకి వచ్చే కాల్వ మరమ్మతులు చేపట్టాలని కోరారు. గౌరాయిపల్లి చెరువు నుంచి సాదువెల్లి చెరువు, కాచారం చెరువు వరకు కాల్వ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
మల్లాపురం చెరువు నుంచి కాల్వ ద్వారా గుబ్బడి చెరువు నింపాలని, గంధమల్ల రిజర్వాయర్ పనులు వెంటనే ప్రారంభించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నాయకులు కల్లూరి.రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సతీష్ భట్, పలువురు రాజకీయ నాయకులు, రైతులు తదితరులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మార్వో సందర్శించారు.
ఇదీ చదవండి: రావి నారాయణరెడ్డి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న సీఎం కేసీఆర్