Devotees problems due to KCR Yadadri Visit : యాదాద్రి పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారుల తీరుతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఉదయం నుంచే కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించలేదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. వాహనాలను ముందస్తుగా నిలిపివేయడం వల్ల భక్తులు... ఘాట్ రోడ్డు వెంట కాలినడకన కొండపైకి చేరుకున్నారు. అంతేకాకుండా యాదగిరిగుట్టలో రిలే దీక్షలు చేస్తున్న దుకాణాదారులను అరెస్టు చేసి... ఆలేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తిరిగి కొండపైనే షాపులు కేటాయించాలంటూ వర్తక సంఘం ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారం వద్ద గత 40 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారిని... సీఎం పర్యటన నేపథ్యంలో అరెస్టు చేశారు.
యాదాద్రిలో సీఎం
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న సీఎం... కొండ చుట్టూ అభివృద్ధి పనులను హెలికాప్టర్ నుంచి విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి... ఆలయ అధికారులు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితుల వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయంలో ఇప్పటివరకు జరిగిన పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.