యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి బాలాలయంలో శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలు (devi navaratrulu in yadadri ) ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా స్వస్తి వాచనము కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి పేర్కొన్నారు. 9 రోజుల పాటు నిర్వహించే పూజల్లో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. సప్తశతి పారాయణం, లక్ష కుంకుమార్చన పూజలు ఉన్నాయని చెప్పారు.
కనులవిందుగా రథాలు
మరోవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులను ఆకట్టుకునేలా వివిధ హంగులతో స్వామివారి సన్నిధిని తీర్చిదిద్దుతున్నారు. జైపుర్ నుంచి ఇటీవలే రప్పించిన స్వామివారి రథం కటౌట్లు రెండింటిని పడమటి దిశలో ఆలయ రక్షణ గోడకు బిగించారు. వీటిని ఫైబర్‌తో రథం ఉట్టిపడేలా తయారు చేయించారు. ఇదే మాదిరిగా ఉండే ఐరావతాలను గతంలోనే బిగించిన విషయం తెలిసిందే. కొండపైన పునర్నిర్మితమవుతున్న శివాలయ రథశాలను శైవాగమ హంగులతో రూపొందిస్తున్నారు. ఆ రథశాలకు త్రిశూలం కటౌట్లు అమర్చారు.
సంధ్యా సమయం.. ముగ్ధమనోహరం
యాదాద్రి పంచనారసింహుల ఆలయ గోపురాలు, పరిసరాలు సూర్యుడు అస్తమించే సమయంలో కనువిందు చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం శ్రీస్వామి సన్నిధి ‘ఈటీవీ భారత్’ కెమెరాకు చిక్కింది.
త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రీశుడి పుణ్యక్షేత్రాభివృద్ధికి శ్రీకారం చుట్టి ఐదేళ్లు కావొస్తోంది. ఈ క్షేత్రాన్ని విశ్వఖ్యాతి చెందేలా రూపొందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానాలయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత జూన్ 21న క్షేత్రాన్ని సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ఆయన జారీ చేసిన ఆదేశాలతో పనులను చకాచకా పూర్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: