యాదాద్రి ఆలయ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 11.30 సమయంలో యాదాద్రి చేరుకున్నారు. మొదటగా ప్రత్యేక బస్సులో కొండచుట్టూ తిరిగి రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. మధ్య మధ్యలో వాహనాన్ని ఆపి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలాలయం చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పనుల పురోగతిపై పరిశీలన
నరసింహుని దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో కలియ తిరుగుతూ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, మాడవీధులు, అష్టభుజి ప్రాకార మండపాల్లో శిల్పాలను సీఎం పరిశీలించారు. 32 నరసింహ అవతారాలు, వైష్ణవాచార్యులైన ఆళ్వారుల మండపాల నిర్మాణాలను తిలకించారు. పనుల తీరుతెన్నులను సీఎంకు వివరించిన ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి స్థపతులు, శిల్పకళాకారులకు పలు సూచనలు చేశారు. వ్రత మండపం, శివాలయం పనులను పరిశీలించిన కేసీఆర్ యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై అర్చకులు, అధికారులతో చర్చించారు.
అసంతృప్తి... ఆగ్రహం
స్థానిక హరిత హోటల్లో యాడా సిబ్బంది, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఐదేళ్ల సమయం తీసుకుంటారా అన్ని ప్రశ్నించారు. పనులు ఎప్పట్లో పూర్తి చేస్తారంటూ వారిపై మండిపడ్డారు. రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు చెప్పగా.. ఆర్థికశాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. రూ.50 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
యాడాకు నూతన ఉన్నతాధికారి
పనుల ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి... యాడాకు త్వరలోనే మరో ఉన్నతాధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ అండ్ బీకి సీఈ స్థాయి అధికారిని నియమించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాడా నాయకులు, కలెక్టర్, రాచకొండ సీపీ పాల్గొన్నారు.