ఇవాళ్టి నుంచి యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామం మొత్తం తన కుటుంబమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వాసాలమర్రి అభివృద్ధికి గ్రామస్థులంతా ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు. కులం, మతం తేడా లేకుండా అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. గ్రామంలో రెక్కల కష్టంపై బతికేవాళ్లకు అండగా నిలవాలని కేసీఆర్ సూచించారు. గ్రామ అవసరాలు ఇక్కడ లభించే వనరుల ద్వారా తీర్చుకోవాలన్నారు. గ్రామస్థులంతా వారానికి 2 గంటలు పనిచేస్తే అభివృద్ధి జరగదా? అంటూ ప్రజల నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
గ్రామంలో పోలీస్ కేసులు ఉండొద్దు..
గ్రామంలో ప్రతి వర్గం కష్టనష్టాలను సర్పంచ్ చూడాలని కేసీఆర్ సూచించారు. కులవృత్తులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం.. కులవృత్తిదారులు గ్రామాభివృద్ధికి దోహదపడుతున్నారు. బంగారు వాసాలమర్రి కోసం గ్రామస్థులంతా కలిసి పనిచేయాలి నిర్దేశించారు. గ్రామస్థులంతా నిందించుకోవడం, దూషణలు మానేయాలని సూచించారు. గ్రామంలో కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలోని భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. యువత కోసం ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు అందిస్తామని, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికీ పాడి పశువులు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి ప్రభావం పరిసర గ్రామాలపై పడుతుందన్న కేసీఆర్.. అంకాపూర్ అభివృద్ధితో 300 గ్రామాల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు.
ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇస్తాం. గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించుకుందాం. గ్రామంలో రహదారులు చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు వివరించాలి. గ్రామ అవసరాలకు గ్రామ నిధి ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వంతో పాటు గ్రామంలోని ప్రతి కుటుంబం నిధికి సహకరించాలి. కులాల జనాభా ఆధారంగా గ్రామ అభివృద్ధి ఏర్పాటు చేయాలి. గ్రామ శ్రమదాన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రత, తాగునీటి కోసం కమిటీ ఏర్పాటు చేయాలి. రైతులంతా కలిసి వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఐకమత్యంతో ముందడుగు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నా. గ్రామస్థుల శ్రమదానం, పట్టుదల తోడైతే గ్రామం అద్భుతంగా మారుతుంది. గ్రామంలో జబ్బునపడినవారికి ప్రభుత్వం తరఫున చికిత్స అందిస్తాం. గ్రామంలో అర్హులైనవారికి రేషన్ కార్డులు అందిస్తాం.
- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఇదీచూడండి: Cm Kcr: దత్తత గ్రామంలో సీఎం పర్యటన... గ్రామస్థులతో సహపంక్తి భోజనం