సీఎం కేసీఆర్ ఆదివారం యాదాద్రికి వస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్టలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న కేసీఆర్ ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, హరిత హోటల్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
కేసీఆర్ యాదాద్రి వచ్చి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి యాదగిరిగుట్టలో ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్డు మార్గాన్ని తనిఖీ చేసి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. మరోవైపు రోడ్డు మార్గం ద్వారా వస్తాడనే సమాచారంతో రహదారిని కూడా అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే యాదాద్రి కొండపైన హరిత టూరిజం హోటల్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం ప్రధానాలయం, ప్రెసిడెన్షియల్ సూట్ల పనులు, రింగ్ రోడ్డు పనులు పరిశీలిస్తారన్న సమాచారంతో క్షేత్రస్థాయిలో తిరిగి పర్యవేక్షించారు. మరోవైపు యాదాద్రి టెంపుల్ సహా యాదగిరిగుట్టను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎంవో నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బంది, అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం పర్యటించే ఏరియాను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేస్తున్నారు.
ఇదీ చూడండి : పనులు ఆగితే ఫోన్లో మెసేజ్ పెట్టండి: నిరంజన్ రెడ్డి