ముఖ్యమంత్రి హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి దళితులకు దళిత బంధు చేకూరింది. చెప్పినట్లుగానే లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకుగానూ 66 మంది ఖాతాల్లో నగదు జమయ్యింది. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నగదును జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమచేసింది.
తెలంగాణలో ప్రతి వర్గానికీ న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో, ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని... ఈ నేపథ్యంలోనే దళితబంధును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అణగారిన దళితజాతి అభ్యున్నతి కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టి ఎస్సీలకు అండగా నిలుస్తామన్నట్లుగానే.. నేడు వాసాలమర్రిలోని దళిత లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యింది.