హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గౌరెల్లి జంక్షన్ నుంచి కొత్తగూడెంకు కొత్తగా గుర్తించిన జాతీయ రహదారికి నంబరింగ్ ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. బుధవారం దిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి.. వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లందుల మీదుగా వెళ్లే ఈ కొత్తగూడెం రహదారిని 2019లో జాతీయ రహదారిగా గుర్తించారని వివరించారు. ఈ రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వైజాక్ పోర్టు, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్‌ల మధ్య వంద కిలోమీటర్లు దూరం తగ్గుతుందన్నారు.
ఈ రహదారి గిరిజన ప్రాంతాల ద్వారా మహబూబాబాద్, కొత్తగూడెం రెండు జిల్లా కేంద్రాల మీదుగా ప్రముఖ సీతారాముల స్వామి ఆలయానికి ప్రసిద్ది చెందిన భద్రాచలం, గోదావరి నదీ తీర ప్రాంతం వెంబడి పోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తన భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంలో వంద కిలోమీటర్ల మేర ఈ రహదారి పోతుందని పేర్కొన్నారు. 2016లోనే ఇందుకు సంబంధించి డీపీఆర్ సిద్దమైనా.. నేటికి ఆ రహాదారికి నంబరింగ్ ఇవ్వలేదని, పనులు మొదలు పెట్టలేదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: బడ్జెట్‌కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు