యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలానికి చెందిన భట్టుగూడెం, చిన్న రావుల పల్లి గ్రామాల్లో 128 సర్వే నెంబరులో గల 15 ఎకరాల 38 గుంటల భూమి మీద ఆధారపడి రెండు గొర్ల కాపరుల కుటుంబాలు 60 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. ఆ భూమికి సంబంధించిన ఓఆర్సీ (ఆక్యుపైడ్ రైట్ సర్టిఫికెట్) ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు.. వారికి చెందిన 8 ఎకరాల 19 గుంటల స్థలానికి చెందిన ఓఆర్సీని పల్లా వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఇచ్చారు.
అధికారులు చేసిన పొరపాటును సరిదిద్ది.. తమ భూమిని తిరిగి తమకు అప్పగించాలని ముక్కెర రామయ్య, ముక్కెర నర్సయ్యలకు చెందిన కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు. భట్టుగూడెం, చిన్న రావులపల్లి గ్రామాల్లోని 123, 1128, 129 130, 179 సర్వే నెంబర్లలోని 50 ఎకరాల భూమిపై గత 60ఏళ్లుగా ఈ రెండు కుటుంబాలు కబ్జాలో ఉన్నాయి. ఈ భూమిలో కొంతభాగం వీరికి ఓఆర్సీ చేసి ఉంది. 128 సర్వే నెంబరులోని 15 ఎకరాల 39 గుంటల భూమిపై.. వివాదం కొనసాగుతుంది.
ఈ వివాదాన్ని పరిష్కరించి ఓఆర్సీ ఇవ్వాలని.. భువనగిరి ఆర్డీవోకు ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా.. అధికారులు స్పందించలేదు. పైగా.. ఆ భూమిని పల్లా వెంకట్ రెడ్డి అనే మరో వ్యక్తి పేరు మీద 8 ఎకరాల 19 గుంటలు ఓఆర్సీ ఇచ్చారు. కబ్జాలో ఉన్న వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా.. అక్రమంగా వేరే వ్యక్తులకు ఎలా ఓఆర్సీ ఇస్తారంటూ.. అధికారులను నిలదీసినా.. వారు స్పందించలేదు. ఆగ్రహించిన రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి భువనగిరి కలెక్టరేట్ భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించి.. ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. నిరసన తెలియజేస్తున్న బాధితులకు గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం భువనగిరి జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం సంఘీభావం ప్రకటించి వారితో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'