యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చాలా అద్భుతంగా జరుగుతోందని.. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం సీఎం కేసీఆర్ అదృష్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ పేర్కొన్నారు. మంత్రి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి తన ఇష్ట దైవమని.. ఏపీ సీఎం వై.ఎస్. జగన్తో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ చక్కటి పాలన అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చూస్తుంటే.. యాదాద్రి ఆలయాన్ని నిర్మించడానికే సీఎం కేసీఆర్ జన్మించారనే రీతిలో జరుగుతున్నాయని కొనియాడారు.
సంక్షేమ పథకాల వరద..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాల వరద పారిస్తూ.. ప్రజలకు చక్కటి పాలన అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో నెలకో సంక్షేమ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ.. సీఎం జగన్ పాలనను అభినందిస్తున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: భువనగిరిలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం