సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Justice nv ramana) దంపతులు రేపు యాదాద్రిలో పర్యటించనున్నారు. వారితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. రేపు ఉ.8.30 గంటలకు యాదాద్రి చేరుకోనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఓఆర్ఆర్ మీదుగా ఉదయం 8:30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 8.45కి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9.15కి పునర్నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్స్, టెంపుల్ సిటీని సందర్శించనున్నారు.
సీజేఐ బసకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాలయాన్ని సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ అతిథిగృహంలో అల్పాహారం, అనంతరం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, ఐఏఎస్ అధికారిణి అనితారామచంద్రన్ పరిశీలించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఆలయ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్‌లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..