గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో రోజూ తాగునీరు అందించడమే నూతన సంవత్సరంలో తన మొదటి ప్రాధాన్యత అని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని.. నగరానికి మణిహారంగా నిలిచే భద్రకాళీ బండ్ నిర్మాణం పూర్తయ్యిందన్నారు. నగరవాసులకు మెట్రో నియో రైలు అందుబాటులోకి తీసుకురావడానికి విస్తృత కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సమష్టి కృషితో కరోనా వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చామని...ఆ క్లిష్ట సమయంలో చేసిన పని ఎనలేని సంతృప్తినిచ్చిందంటున్న కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
1. నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధి పరంగా మీ లక్ష్యాలు. ప్రాధాన్యతలు ఏంటి?
కలెక్టర్: గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి రోజు మిషన్ భగీరధ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించడానికే మొదటి ప్రాధాన్యత. తాగునీటి సరఫరాకు సంబంధించి పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. ఇంకా పెండింగ్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. బిల్లులన్నీ మంజూరు చేసి త్వరగా పనులయ్యే విధంగా చేస్తున్నాం. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. వేర్వేరుగా నిర్వహించిన సమీక్షల్లోనూ.. ఇదే చెప్పారు. కరోనా కారణంగా పనులు కొంత నెమ్మదించాయ్. ఇతర రాష్ట్రాలకు కార్మికులు వెళ్లిపోవడం వల్ల అప్పటిదాకా జరిగిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం పనుల్లో వేగం పుంజుకుంటోంది. అన్నీ సకాలంలో పూర్తయ్యేలా రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తున్నాం.
2. చారిత్రక నగరికి పర్యాటకులను ఎక్కువగా రప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: పర్యాటకులు ఎక్కువ మంది వచ్చి నగర అందాలు వీక్షించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నగరానికి మణిహారంగా నిలిచే భద్రకాళీ బండ్ పూర్తయ్యింది. రెండో దశ పనులూ వేగంగా పూర్తి చేయిస్తాం. జైన మందిర నిర్మాణం పూర్తయ్యింది. కొత్త పార్కులు ఆహ్లాదం కలిగిస్తాయి. నగరానికి వచ్చిన వారిని ఆకర్షించే విధంగా ప్రధాన కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నాం. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపడుతున్నాం.
3. మెట్రో నియా రైలు ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి పనులు ఎంతవరకూ వచ్చాయ్?
కలెక్టర్: మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. అలైన్‌మెంట్ ఫీక్స్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ స్టేషన్లు నిర్మించాలన్నదీ నిర్ణయించాం. కొత్త సంవత్సరంలో రైలు పరుగులు తీసేందుకు అవసరమైన పురోగతి కచ్చితంగా ఉంటుంది.
4. జిల్లా కలెక్టర్‌గా మీకు సంతృప్తినిచ్చిన అంశం?
కలెక్టర్: కొవిడ్ సమయంలో చేసిన పని చాలా సంతృప్తిని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఒకేసారి 23 కేసులు ఇక్కడ రావడం అందరికి ఆందోళన కలిగించింది. వెంటనే ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్ జోన్లు పెట్టాం. జోన్లలో ఉన్నవారు బయటకు రాకుండా కట్టడి చేశాం. వారికి నిత్యవసర సరకులు అందించాం. ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ వార్డు ఏర్పాటు చేశాం. ఇతర రోగులకు వైద్యం అందిస్తూనే.. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాం. ఆక్సిజన్ సరఫరాలో కానీ.. వెంటిలేటర్ల ఏర్పాటులో కానీ ఎక్కడా ఎలాంటి కొరత రానివ్వలేదు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇంకా అనేక మంది అధికారులు, సిబ్బంది.. సమష్టి కృషి ఫలితమే ఇది. ముఖ్యమంత్రి, సీఎస్, మంత్రులు ఎప్పటికప్పుడూ ఇచ్చిన సూచనల వల్ల అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగాం. ఇలాంటి క్లిష్ట సమయంలో పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇదే సమయంలో మిగతా అభివృద్ధి పనులు ఆలస్యమయ్యాయన్న బాధ ఉంది.
5. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌పై జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తిపై మీరేమంటారు ?
కలెక్టర్ : స్ట్రెయిన్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం... శానిటైజర్లు ఉపయోగించడం.. భౌతిక దూరం పాటించడం మొదలైన కొవిడ్ నిబంధనలను పాటిస్తే.. కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ కరోనా వైరస్ సోకినా.. అధైర్యపడొద్దు. అలాగని నిర్లక్ష్యమూ తగదు.
6. కరోనా టీకా పంపిణీకి సంబంధించి సిద్ధంగా ఉన్నట్లేనా...ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా?
కలెక్టర్: టీకా పంపిణీకి సంబంధించి మేం అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నాం. దీనిపై గత నెలరోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. పలుమార్లు దృశ్య మాధ్యమ సమీక్షలు నిర్వహించారు. మేమూ జిల్లా అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించాం. మొదటి దశలో టీకా ఇచ్చేవారి వివరాలు సేకరించాం. టీకా భద్రంగా నిల్వచేసేందుకు.. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పంపిణీ కోసం అవసరమైన పరికరాలు జిల్లా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. దీనికి సంబంధించి డ్రైరన్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం.
7. జిల్లా ప్రజలకు మీరిచ్చే సలహా సూచనలు ఏమిటి ?
కలెక్టర్ : జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండాలి. కొవిడ్ నిబంధనలు పాటించడం ఎవరూ మరిచిపోవద్దు. కొత్త సంవత్సరంలో.. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నా.
ఇవీచూడండి: ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్ : సుచిత్ర ఎల్ల