గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలింది. అన్ని పార్టీల నుంచి టికెట్ రాని మెజార్టీ ఆశావాహులు ఈసారి అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు నేతల బుజ్జగింపు యత్నాలు ఫలించి.. ఉపసంహరించుకున్నారు. కొందరు మాత్రం పోటీకే సై అంటూ.. స్వతంత్రులుగా బరిలో నిలిచారు. తెరాస, భాజపా 66 డివిజన్లలో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 65 చోట్ల పోటీ చేస్తోంది.
29వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బుద్ధ జగన్… ఆఖరి నిమిషంలో గులాబీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. అధిష్ఠానం ఆదేశాలతో… 28వ డివిజన్ అభ్యర్థికి బీ ఫారం ఇచ్చి… 29వ డివిజన్లో పోటీకి నిలబెట్టారు. 28లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థికి మద్దుతు పలికారు. ఇక తెలుగుదేశం 14, సీపీఎం09, సీపీఐ 07 డివిజన్లలో పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి.
అభ్యర్థుల ఎంపిక ముగియడంతో.. ఇక రేపటినుంచి ప్రచారం జోరందుకోనుంది. తెరాస తరఫున ఇప్పటికే మంత్రి సత్యవతి రాఠోడ్ నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం ప్రారంభించారు. రేపటినుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారపర్వంలోకి దిగుతున్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా నేతలంతా ప్రచారంలోకి దిగనున్నారు. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవీచూడండి: పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ