వీధి వ్యాపారుల హక్కులను గుర్తించి, వారి జీవనోపాధి పెంపుదలకు 2014లో చట్టం రూపొందించింది కేంద్ర సర్కారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలో వరంగల్, సిద్దిపేట నగరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంపిక చేసింది. కేంద్ర గృహనిర్మాణ శాఖ సహాయ కార్యదర్శి సంజయ్‌కుమార్ ఈ వివరాలు తెలిపారు. వీధి వ్యాపారుల చట్టం అమలు, భవిష్యత్తు ప్రణాళిక చర్యలను తెలుసుకునేందుకు సంజయ్‌కుమార్ హన్మకొండ నగరానికి విచ్చేశారు. సోమవారం ఉదయం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్ రవికిరణ్‌ఉన్నారు.
వీధి వ్యాపారుల జీవనోపాధి పెంపుదలకు కేంద్ర సహాయం వీధి వ్యాపారుల అభ్యున్నతి కోసం...మిషన్ మోడ్‌లో వీధి వ్యాపారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న రాష్ట్రాలకు రూ.10 కోట్లు, రూ.5కోట్లు, రూ.3 కోట్ల చొప్పున మొదటి మూడు స్థానాలకు నగదు అవార్డులను కేంద్రం అందిస్తుందన్నారు. దీని ద్వారా వచ్చే నిధులతో నగరంలో వీధి వ్యాపారుల సంక్షేమానికి ప్రతిపాదనలు రచించాలని కోరారు. నగర కమిటీ ద్వారా వీధి వ్యాపారులను గుర్తించి సర్టిఫికెట్లు, లైసెన్సులు జారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం రూపొందించిన జాబితాలో పేర్లు లేని వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నగరంలో హాకర్స్ జోన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించేందుకు నిపుణుల సంస్థను ఏర్పాటు చేయాలని సంజయ్‌కుమార్ కోరారు. వీధి వ్యాపారులకు సామాజిక భద్రత పథకాలు వర్తింపజేయాలని, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, మాతా శిశు సంక్షేమ పథకాలు, జీవిత బీమా, బ్యాంకుల ద్వారా రుణాలు, విద్యా సదుపాయాలు కల్పించాలన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇస్తారన్నారు. రుణాల మంజూరుకు రుణ మేళాలు నిర్వహించాలన్నారు. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల భద్రత, సంరక్షణకు నగరంలో తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు.
3,451 మంది గుర్తింపు: కలెక్టర్ జీవన్‌పాటిల్
నగరంలో మెప్మా ద్వారా నిర్వహించిన సర్వేలో 3451 మంది వీధి వ్యాపారులను గుర్తించామని, వీరందరికి గుర్తింపు కార్డులు జారీ చేశామని అర్బన్ జిల్లా కలెక్టర్ జీవన్‌పాటిల్ వెల్లడించారు. 1566 మందికి పొదుపు ఖాతాలు, 1526 మందికి సామాజిక భద్రత పథకాలు వర్తింపజేస్తున్నట్లు వివరించారు. మెప్మా ద్వారా 15 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఏర్పాటు చేశామని, రెండు గ్రూపులకు రూ.2.50 లక్షల చొప్పున లింకేజీ రుణాలు అందించామన్నారు. రూ.1.18 కోట్లతో ఆరు చోట్ల వీధి వ్యాపారుల మార్కెట్లను ఏర్పాటు చేశామన్నారు. మేయర్ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ వీధి వ్యాపారుల కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వరంగల్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు వ్యాపారులు భాగస్వాములు కావాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ మహా నగరంలో 21 చోట్ల హాకర్ల జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వివిధ కారణాలతో కొన్నిచోట్ల ఇబ్బందులు వచ్చాయన్నారు. సుబేదారి సెంటర్‌లో ఆటవీ శాఖ కార్యాలయం ముందు 80 మంది వీధి వ్యాపారులకు షెడ్లు నిర్మిస్తుంటే అభ్యంతరాలు తెలిపారన్నారు. ప్రతి వీధి వ్యాపారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ కృష్ణవేణి, డీసీపీ కేఆర్.నాగరాజు, ఎస్‌ఈ భిక్షపతి, ఆరోగ్యాధికారి డాక్టర్ రాజారెడ్డి, వీధివ్యాపారుల నగర కమిటీ ప్రతినిధులు ఎండీ.సత్తార్, ఎండీ.ఇస్మాయిల్, పద్మ, రసూల్, లింగమూర్తి, స్వరూప, ప్రకాశమ్మ తదితరులు పాల్గొన్నారు.