రెండు పడకల ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో ప్రభుత్వం మండలానికి 40 ఇళ్లు మంజూరు చేసింది. వీటి కోసం వేలాది మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. పేదరికంతో ఉన్నవారిని ఎంపిక చేసిన అనంతరం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకు 40 ఇళ్లు మంజూరు కాగా 1200 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు ఇంటింటా తిరిగి 150 మందిని అర్హులుగా గుర్తించారు. 17.03.2016న గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో 40మందిని ఎంపిక చేసి జాబితా పంచాయతీ నోటీసు బోర్డుపై అతికించారు. ఎంపికైన లబ్ధిదారులపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అందరికీ పట్టాలిచ్చారు. స్థానిక బీసీ కాలనీలో ఎకరంన్నర భూమిని రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు. భూమికి హద్దులు చూపించి గుత్తేదారుకు అప్పగించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు 20 రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి గుంతలు తీసి సిమెంటు ఫిల్లర్లు నిర్మించి వదిలేశారు.
మంత్రి నియోజకవర్గంలో సైతం
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణం నత్తనడక సాగుతోంది. కమలాపూర్ మండల కేంద్రంతో పాటు గూడూరు, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో మొదటి విడతలో 40 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించి హద్దులు చూపించారు. ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పనులు చేపట్టిన గుత్తేదారు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కమలాపూర్‌లో 300కుపైగా ఇళ్లు మంజూరు చేయగా సిమెంటు పిల్లర్ల వరకు నిర్మాణం జరిగింది.
ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు
గూడూరులో గుంతలు తీసి పనులు చేయకుండా వదిలేశారు. మర్రిపెల్లి గూడెంలో శంకుస్థాపన చేసినా పనులు మొదలు పెట్టలేదు. ఎల్కతుర్తి మండలం జీల్గుల, కేశవాపూర్ గ్రామాలకు ఇళ్లు మంజూరు చేశారు. జీల్గులలో 20మంది లబ్ధిదారుల కోసం రెండేళ్ల కిందట ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. కేశవాపూర్‌లో 20మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఆ భూమి తమదంటూ పలువురు రైతులు అడ్డుకోవడంతో మరో స్థలం కేటాయించారు. లబ్ధిదారులు అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని సూచించగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండు పడకల ఇళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు లేక గుత్తేదారులు పనులు చేయడం లేదు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. పనులు వేగంగా చేయడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని భవనాల శాఖ డీఈఈ రాజు తెలిపారు.
ఇదీ చూడండి : అన్ను భాయ్.. స్పెషల్ ఛాయ్