Street Dogs Attacks In Warangal : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి. నగరంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలను చూసి నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంలో శునకాల దాడులు పెరుగుతున్నా.. అధికారుల్లో మాత్రం చలనం లేదు.
వరంగల్ మహా నగరంలో ప్రస్తుతం కర్ర లేనిదే.. కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఏవైపు నుంచి వీధి కుక్కలు దాడి చేస్తాయోనని నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నాపెద్దా ఎవరైనా సరే.. కుక్కలంటే వణికిపోతున్నారు. నగరవాసులపై కుక్కలు మీద పడి రక్కుతున్నా.. అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నగరంలో 30 వేలకు పైగా కుక్కల సంచారం ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఏ వీధిలో చూసినా గుంపులు గుంపులుగా కుక్కలే కనిపిస్తున్నాయి. సాయంత్రం వేళ దాడులకు పాల్పడుతుంటే.. రాత్రి వేళ అరుస్తూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జంతు సంరక్షణ చట్టం కింద వీటిని చంపడానికి వీలు లేకపోయినప్పటికీ.. శాస్త్రీయంగా మాత్రం వీటికి కుటుంబ నియంత్రణ చికిత్స చేసే వెసులుబాటు ఉంది. కాశీ బుగ్గ, కరీమాబాద్, లేబర్ కాలనీ, శివనగర్, హన్మకొండ, ఖాజీపేట, బాపుజీ నగర్లో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది.
ఒక్క కుక్క.. 28 మందికి కాటు..: నగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. గతంలో హన్మకొండలోని రెడ్డి కాలనీలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఏకంగా 28 మందిని తీవ్రంగా గాయపరిచింది. అది మరువక ముందే ఈ నెల 4న నెక్కొండకు చెందిన వీరమ్మపై శునకాలు దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
7 ఏళ్ల బాలుడు మృతి: తాజాగా ఖాజీపేటలోని రైల్వే కాలనీలో యూపీకి చెందిన చోటూ ఇంటి బయట ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు దాడి చేశాయి. శునకాల దాడిలో గాయపడిన చోటూను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 7 సంవత్సరాల చోటూ కన్నుమూశాడు. చోటూ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వినయ్ భాస్కర్‌తో పాటు నగరపాలక సంస్థ మేయర్ సుధారాణి మృతుని బంధువులను పరామర్శించి.. మహా నగరపాలక సంస్థ తరఫున రూ.లక్ష పరిహారంగా అందజేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వీధి కుక్కల దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని.. శునకాల నియంత్రణకు కృషి చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: