Illegal Autism Therapy Centres In Hyderabad : హైదరాబాద్‌లో నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా సాగుతోంది. నిపుణుల ఆధ్వర్యంలో థెరపీ చికిత్సలు చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. ఒక్కో సెషన్‌కు తల్లిదండ్రులనుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. వయసుకు తగ్గట్లు పిల్లల్లో మానసిక ఎదుగుదల సక్రమంగా లేకపోవడాన్ని ఆటిజం సమస్యగా గుర్తిస్తారు.
గ్రేటర్‌లో విచ్చలవిడిగా నకిలీ కేంద్రాలు : ఎక్కువ శాతం పిల్లలకు మూడేళ్ల వయసు నుంచి ఈ సమస్య వస్తుంది. గర్భధారణ సమయంలో ఇన్‌ఫెక్షన్లు, మెదడులో ఎదుగుదల లోపాలు, జన్యుకారణాలు, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముందే గుర్తించి చికిత్స అందిస్తే దాదాపు 80 శాతం వరకు ఆటిజాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రుల అవసరాన్ని నకిలీ థెరపీ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కూకట్‌పల్లి, సుచిత్రా, బీకెగూడ, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో నకిలీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
నిపుణుల పర్యవేక్షణ లేకుండా చికిత్సలు : పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఆటిజం ఉన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆటిజం థెరపీ కోసం ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటర్, డిగ్రీ చదివిన వారికి కొంత మేర శిక్షణ కల్పించి ఈ కేంద్రాల్లో థెరపిస్టులుగా నియమించడం జరుగుతుంది.
కొంతమంది ఒక కేంద్రానికి రిజిస్ట్రేషన్ చేసి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాల్లో బ్రాంచిలు పెడుతున్నారు. అక్కడ శిక్షణ లేని వారిని పెట్టి థెరపీ పేరుతో సెంటర్లను నడిపిస్తున్నారు. వారానికి 4 నుంచి 5 సెషన్ల పేరుతో రూ.వేలకు వేలు వసూలు చేస్తున్న సెంటర్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి కేంద్రాలపై అధికారిక పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయి.
ముందే లక్షణాలు గుర్తించాలి : పిల్లల్లో ఆటిజం లక్షణాలను ముందే గుర్తిస్తే ప్రవర్తన థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ సాయంతో నయంచేయవచ్చని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కరుణ తెలియజేశారు. ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం, మాట్లాడలేకపోవడం, ఇతరులు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, మనం ఏదీ చెపితే తిరిగి అదే చెప్పడం ఇలా హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
కొన్నిసార్లు ఇతర డిజిటల్ పరికరాలకు పరిమితం కావడం కూడా ఆటిజం డిజార్డర్‌కు కారణమని తెలిపారు. వాటిని తగ్గించేందుకు థెరపీ అందిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా పిల్లలను దూరం చేయవచ్చని అన్నారు. పిల్లల్లో పెరుగుతున్న ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కేంద్రాలు, చికిత్సలపై ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
రోజూ మార్నింగ్ 9 లోపు ఈ 5 పనులు చేయాలట! ఇలా చేస్తే బాడీ మొత్తం డీటాక్స్ అవుతుందట!!