Turmeric Price Hike in Warangal : ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్‌గా పేరు గడిచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో(Enumamula Market) పసుపు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో క్వింటాల్ పసుపు ధర రెట్టింపు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పసుపు డిమాండ్ పెరగడంతో పాటు పసుపు నిల్వలు గతం కంటే తగ్గడంతో వ్యవసాయ మార్కెట్లో మంచి ధరలు దక్కుతుందంటున్నారు రైతులు. గత వారం క్వింటా రూ.6వేలు పలికిన ధర.. ప్రస్తుతం రూ13 వేలకు చేరింది. అంతేగాక రాబోయే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.
Turmeric Price Hiked in Warangal Market : మార్కెట్ యార్డుల్లో పసుపునకు మంచి ధర పలుకుతున్నప్పటికీ అది రైతులందరికీ దక్కడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఒకరిద్దరికి మాత్రమే రూ.13వేలు చెల్లించి.. మిగిలిన రైతులకు రూ.10వేల నుంచి 11 వేల మధ్య మాత్రమే వ్యాపారులు చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుత ధరలు(Turmeric Price) ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. గతంతో పోలిస్తే సాగు ఖర్చులు పెరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ పసుపు రైతులను మాత్రం విస్మరించిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
"పోయిన వారం క్వింటా పసుపు ధర రూ.6వేలు పలికింది. ఇప్పుడు రూ.13వేలు పలుకుతోంది. పసుపు ధర రూ.15వేలు పలికితే రైతుకు లాభం రూ.13వేలు కూడా నష్టమే. ఎందుకంటే ఖర్చు ఎక్కువ. అందుకే ఈసారి రైతులు పసుపు పంట కాకుండా వేరే పంటల్ని వేశారు. అన్నింటికి మద్ధతు ధర ప్రకటిస్తున్నా పసుపునకు మాత్రం ఇవ్వడం లేదు. పండిస్తే గిట్టుబాట ధర రాదేమోననే భయంతో పసుపు పంట వేయడానికి రైతులు వెనకడుగేస్తున్నారు. ఇప్పటి వరకు పసుపు పంటను నష్టానికే విక్రయించాం. ఇప్పుడు కాస్త ఊరట కలిగించేలా ఉంది ధర." - రైతులు
Turmeric Procurement in Warangal : మార్కెట్లలో పసుపునకు ధర పెరగడాన్ని అదునుగా భావించిన వ్యాపారులు, హమాలీలు, కూలీలు అందినంత దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కొర్రీలు పెట్టి మూడు కిలోలను తరుగు పేరిట బహిరంగంగానే దోచేస్తున్నారన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ నామ్‌ను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని.. వ్యాపారులు, కొంతమంది అధికారులు, గ్రూపుగా మారి నామమాత్రంగా తూకాలను వేయిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
పీవోఎస్ మెషీన్ ద్వారా రైతుల సరుకులను తూకం వేయాల్సి ఉండగా.. ప్రస్తుతం మార్కెట్ యార్డులో అవి ఎక్కడా కనిపించడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మార్కెట్ యార్డులో రైతు సరుకులకు భరోసా కల్పించడంతోపాటు.. దోచుకుంటున్న హమాలీలు, కూలీలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
Mahabubabad Farmers Problems : వాగు దాటితేనే సాగు.. పంట పండించాలంటే అక్కడ రిస్క్ చేయాల్సిందే
Warangal Farmers Problems : సాగును కుదేలు చేస్తున్న ప్రకృతి ఉపద్రవాలు.. రైతుల కంట కన్నీళ్లు