palakurthi Tourism Development: పలికెడిది భాగవతమట.. పలికించెడివాడు రామభద్రుడంట అంటూ రాముడిని కీర్తించిన.. పోతానామాత్యుని భక్తిప్రపత్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి పోతన నడయాడిన నేలగా చెప్పుకునే జనగామ జిల్లా పాలకుర్తి మండలం... బమ్మెరను బాసరగా.. తీర్చిదిద్దేందుకు సర్కార్.. అన్ని చర్యలు తీసుకుంటోంది.
Tourism Development in Jangaon : బమ్మెర శివారులో పోతన సమాధి స్మారక కేంద్రం.. నాలుగెకరాల్లో సుందరంగా ముస్తాబవుతోంది. మూడు కోట్ల వ్యయంతో 22 అడుగుల ఎత్తైన పోతన కాంస్య విగ్రహాన్ని వచ్చే నెలలో.. ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బాసరలో తరహాలోనే.. సరస్వతీ దేవి విగ్రహాన్ని నెలకొల్పి.. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతంగా తయారుచేసి.. సందర్శకులకు.. వసతులు కల్పించనున్నారు.
పాల్కురికి సోమనాథుడి విగ్రహం ఏర్పాటు: జనగామ జిల్లా పాలకుర్తి అనగానే అందరి మదిలో మెదిలే మరో కవి.. పాల్కురికి సోమనాథుడు. మహాకవులు బసవేశ్వరుడు, పాల్కురికి సోమనాథుడు నడయడిన నేలగా.. ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. క్షీరాద్రిపై వెలసిన ప్రసిద్ధ సోమేశ్వరస్వామి ఆలయ సమీపంలోనే రెండున్నర కోట్లతో.. సోమనాథుని ఆడిటోరియం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల పాల్కురికి సోమనాథుడు విగ్రహం నెలకొల్పారు. ఎంతో అద్భుతంగా పాల్కురికి సోమనాథునికి స్మారక చిహ్నం ఏర్పాటు చేసి.. పర్యాటకులను ఆకర్షించనున్నారు.
పాలకుర్తికి సమీపంలోనే ఉన్న వల్మిడి.. మరో భద్రాద్రిగా అభివృద్ధి చెందుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏటా నెలపాటు వైభవంగా నిర్వహిస్తారు. శివారు రాముల గుట్టపై నూతన రామాలయ నిర్మాణ పనులు చేపట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో పర్యాటక ప్యాకేజీలో చేర్చి ఇతర సముదాయాలు నిర్మిస్తున్నారు. పక్కనే వాల్మీకి మహర్షి తపమాచరించిన గుట్టనూ శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్ల నుంచి చేస్తున్న ప్రగతి పనులు ప్రస్తుతం తుది దశకు చేరాయి. పాలుకుర్తి సర్కిల్ గొప్ప పర్యాటక క్షేత్రంగా బాసిల్లనుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు వసతులు మెరుగుపడనున్నాయి.
"వాల్మీకి, బమ్మెర, పాలకుర్తి సోమనాథుడు ఇక్కడ ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినది మరుగున పడిపోకూడనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాల అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేశారు. అది సరిపోదంటే రూ. 10 కోట్లు ఇస్తున్నారు. ఇవి అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు." - ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: