మహిమల మారాజు మల్లన్న జాతర మూడో రోజు కన్నుల పండువగా సాగింది. బుధవారం మకర సంక్రాంతి సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు చేశారు. మూడోరోజు రాత్రి ప్రత్యేకంగా ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు నిర్వహించి స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిఏటా ఎడ్లబండ్లపై వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంటుందంటున్నారు. రంగురంగుల విద్యుత్ వెలుగుల్లో యువత కేరింతలు కొట్టారు. భక్తి పాటలు, సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.
శివసత్తుల నృత్యాలు
కోర మీసాల మల్లన్న స్వామి జాతర ఆద్యంతం కోలాహలంగా జరుగుతోంది. స్వామిని దర్శించుకోవడానికి గంటలసేపైనా లెక్కచేయక.. క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ఆలయ పరిసరాల్లోనే విడిది చేస్తూ... నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ.. స్వామికి నైవేద్యాలు సమర్పించారు. భక్తిపారవశ్యంతో మమ్మేలు మల్లన్నా... శరణు మల్లన్నా అంటూ చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతించారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు, పూనకాలు హోరెత్తుతున్నాయి.
కొంగుబంగారంగా నిలుస్తున్నాడు
వరంగల్ పట్టణ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర మూడు రోజులపాటు ముచ్చటగా సాగింది. కోరిన కోరికలు తీరాలని, గండాలు తొలగిపోవాలని భక్తులు తలనీలాలు, నైవేద్యం సమర్పించుకున్నారు. మల్లికార్జున స్వామికి జై అంటూ భక్తుల నామస్మరణతో ఆలయం మార్మోగింది. మమ్ము చల్లంగా చూడు స్వామి అని కోరమీసాల మల్లన్నను మనసారా కోరుకున్నారు. కోరిన కోరికలు తీర్చి నమ్మిన వారికి కొంగుబంగారంగా నిలుస్తున్నాడు కోరమీసాల మల్లన్న. గడిచిన మూడు రోజుల్లో స్వామిని దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన నీరాజన మంత్రపుష్పం ఇతర పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ నెల 30న భ్రమరాంబికా అమ్మవారికి సుగంధపరిమల ద్రవ్యములచే విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. వచ్చే నెల 9న రేణుకాదేవి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఉగాదితో జాతర పరిసమాప్తమౌతుంది.
ఇదీ చూడండి : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు...