తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వరంగల్‌లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజల తలరాత మార్చేందుకే ఇంటిని వదిలి 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు కంకణం కట్టుకున్నానని స్పష్టం చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. పట్టభద్రులు, మేధావులు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని... ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.
వరంగల్ పోస్ట్ ఆఫీస్ కూడలి నుంచి కాశిబుగ్గ కూడలి వరకు ఆయన పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి నెరవేర్చిన హామీలు ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను నిర్మాణం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 40ఏళ్ల నాటి వృక్షాలు నరికివేత... అధికారుల చోద్యం...!