వరంగల్ అర్బన్ జిల్లాలో హన్మకొండలోని భవాని నగర్‌కు చెందిన శ్రీ జాతవేద, శ్రీనయని సోదరీమణులు సొంతంగా మాస్కులు తయారు చేస్తున్నారు. లాక్ డౌన్ సెలవుల్లో.. అందరికీ ఉపయోగపడే మాస్కులను తయారు చేసి పారిశుద్ద్య కార్మికులతో పాటు పలువురికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తమ వంతు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశ్యంతో సుమారు 200లకు పైగా మాస్కులను తయారు చేశామని ఈ అక్కా చెల్లెళ్లు వెల్లడించారు.
మరిన్ని తయారు...ఆపై ఉచిత పంపిణీ...
ఈ మాస్కులను మార్కెట్లకు వచ్చే వినియోగదారులతో పాటు పారశుద్ధ్య కార్మికులకు ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరిన్ని మాస్కులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తామని విద్యార్థినులు స్పష్టం చేశారు. సమయాన్ని వృథా చేయకుండా మాస్కులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న విద్యార్థినులను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అభినందించారు.