జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 7 సంవత్సరాల పాప చనిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని 43వ డివిజన్లో చోటుచేసుకుంది. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జేసీబీతో మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నారు. ఇంటి ముందు తన అన్న శక్తి స్వరూప్‌తో కలిసి ప్రిన్సి ఆడుకుంటోంది.
గోడ పక్కన పిల్లలు.. గమనించని డ్రైవర్
ఇంటి ముందు ఉన్న గోడ పక్కన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఇది గమనించని జేసీబీ డ్రైవర్ మురుగు కాలువను శుభ్రం చేస్తూ గోడను ఢీకొట్టాడు. ఇద్దరు పిల్లలపై గోడ పెల్లలు పడి రక్తం మడుగులో కొట్టూమిట్టాడారు. గోడ కూలిన శబ్ధం విని లోపల పని చేసుకుంటున్న తల్లిదండ్రులు బయటకు వచ్చారు. హుటాహుటిన తమ పిల్లలను ఎత్తుకుని ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు.
అమ్ములు ఒక్కసారి పలకవా..
అప్పటికే పాప మృతి చెందింది. ప్రస్తుతం బాబు చికిత్స పొందుతున్నాడు. అమ్ములు... అమ్ములు అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. బతుకు దెరువు కోసం ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన బొడ్డు సాంబశివరావు, ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు కలిసి హన్మకొండకు వచ్చారు. అద్దె గదిలో ఉంటూ.. వండ్రంగి పనులు చేసుకుంటున్నారు. ఉన్నదాంట్లో ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటున్న వారికి డ్రైవర్ నిర్లక్ష్యం వారిని శోకసముద్రంలో ముంచింది.
నాయకుల పరామర్శ..
అప్పటిదాకా అల్లరి చేస్తూ తనతో పాటు మార్కెట్‌కు వచ్చిన అమ్ములు విగత జీవిగా మారగా.. ఆ తండ్రి విలవిలలాడాడు. తల్లిదండ్రులు శోకాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చలించిన మంత్రి ఎర్రబెల్లి..
అంబులెన్స్‌లో ఉన్న పాప మృతదేహాన్ని చూసి మంత్రి చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటానని హామీ ఇచ్చారు. జరిగిన ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..