Pond Occupation In Warangal: ఓరుగల్లులో కబ్జాలు పెచ్చుమీరుతున్నాయి. కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. ఆక్రమించేస్తున్నారు. కొందరు పెద్ద మనుషులైతే.. ఆఖరికి చెరువులనూ కబ్జా చేస్తున్నారు. ఏకంగా ఎనిమిది ఎకరాల మేర స్థలం ఆక్రమించి.. దర్జాగా ప్రహరీ కూడా కట్టేశారు. చెరువు మధ్యలో శిఖం భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ డివిజన్ స్థాయి నేత కన్నుపడింది. బడా నాయకుల అండదండలతో దర్జాగా కబ్జా చేశాడు. తాను ఆక్రమించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించాడు. ఇప్పుడు చెరువు భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించి.. రూ.కోట్లలో లాభాలు పొందుదామని అనుకుంటున్నాడు.
రెవెన్యూ అధికారుల అండతోనే: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామ రెవెన్యూ పరిధిలో.. 526 సర్వే నెంబర్లో ఉన్న చింతల్ చెరువు ఇది. మొత్తం 62 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. జాతీయ రహదారి 163 పక్కనే ఉండటంతో.. ఇక్కడ భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతమైతే ఎకరం రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో ఈ భూమిపై గత కొన్నేళ్లుగా కన్నేసిన సదరు నేత.. కొందరు బడా నేతల అండదండలతో గతంలోనే 20 ఎకరాల వరకు ఆక్రమించాడు. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నెంబర్లను మార్చేసి స్థలాలను విక్రయించాడు. ఇప్పుడు ఆ స్థలాల్లో విలాసవంతమైన భవనాలు కూడా వెలిశాయి.
ఇంత జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. మరింత రెచ్చిపోయిన ఆ రాజకీయ నాయకుడు చెరువు భూమిని ఎనిమిది ఎకరాలకు పైగా ఆక్రమించేసి ప్రహరీ గోడను కట్టాడు. గజాల చొప్పున చేసి స్థలాలను అమ్మేందుకు బోర్డులు కూడా పాతాడు. ఎవరూ రాకుండా గేటు కూడా పెట్టాడు. మొత్తంగా రూ.40 కోట్ల వరకు ఆర్జించేందుకు రంగం సిద్ధం చేశాడు. మరికొందరి దృష్టి.. ఈ భూములపై పడటంతో మరో రెండకరాల చెరువు భూమి కూడా అన్యాక్రాంతమైంది. చెరువు భూమిని కాపాడండంటూ గ్రామస్థులు.. తహసీల్దారు, ఆర్డీవోతో పాటు గత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. ఫలితం కనిపించట్లేదు. 30 ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురైనా అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప.. చెరువు భూమి కాపాడేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అది పట్టా భూమే కానీ ఎఫ్టీఎల్ పరిధిలో: ఈ వ్యవహారంపై హసన్‌పర్తి తహసీల్దారును వివరణ కోరగా.. అది పట్టా భూమేనని.. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం వల్ల నిర్మాణాలు చేసేందుకు వీల్లేదన్నారు. గతంలో జాయింట్ సర్వే చేయించామని.. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ వారి దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. వారి ద్వారా మహానగర పాలక సంస్థ వారికి లేఖ రాస్తే కూల్చేసేందుకు అవకాశం ఉంటుందని హసన్‌పర్తి తహసీల్దార్ స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల్లో నిర్మించిన చింతల్ చెరువు తూము నుంచి చెరువులోకి రావాల్సిన ప్రవాహానికి కూడా అడ్డుగోడ కట్టి వెంచర్ చేశారు. దాంతో నీరంతా రోడ్డు పక్కన నిలిచిపోయి మురికి కూపంలా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ ఆక్రమణల పర్వాన్ని అడ్డుకుని.. సదరు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: