వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం జడ్పీటీసీ సభ్యురాలు చాడ సరిత తహసీల్దార్ విజయలక్ష్మితో చేసిన సెల్‌ఫోన్ సంభాషణ కలకలం సృష్టిస్తోంది. ఇందులో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. వేలేరు మండలం లోక్యతండాలో మట్టి మాఫియా గత నెల మే 6వ తేదీన రాత్రి మట్టిని అక్రమంగా తవ్వుతుండగా సోడషపల్లి గ్రామస్థులు, పలువురు మీడియా ప్రతినిధులు వెళ్లి పట్టుకున్నారు. ఈ క్రమంలో మట్టి మాఫియా మీడియా ప్రతినిధులపై దాడి చేసి ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మర్నాడు జడ్పీటీసీ సభ్యురాలు చాడ సరిత, వరంగల్ ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాంగోపాల్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి వాహనాలను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండు చేశారు. అధికారులు మట్టి వాహనాలను సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణే తాజాగా బయటకు వచ్చింది.
సీజ్ చేసిన వాహనానికి రూ. 25 వేల జరిమానా విధించాలని తాను చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని, తహసీల్దారుతో జడ్పీటీసీ సభ్యురాలు సరిత వాగ్వాదానికి దిగారు. స్థానిక ఎంపీపీ చెప్పినట్టుగా మీరు ఎందుకు జరిమానా విధిస్తున్నారని, ఆయన ఎమ్మెల్సీ పల్లా కన్నా ఎక్కువా అంటూ అధికారిణిపై విరుచుకుపడ్డారు. తన మాటంటే తన అన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటేనని హెచ్చరించారు. ఈ సంభాషణ తర్వాత తహసీల్దార్ ఈ మండలం నుంచి బదిలీ కావడం చర్చనీయాంశమైంది.
అయితే అది తన వాయిస్ కాదని జడ్పీటీసీ చాడ సరిత ఖండిస్తోంది. తనకు గిట్టనివారు ఎవరో కావాలని ఇలా సృష్టించారని ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి: Lock down: ఈ నెల 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం