మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రజలంతా ప్రతీ ఆదివారం 10 గంటల 10 నిముషాల పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా హన్మకొండ చౌరస్తాలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల్లోకి వెళ్లి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు.
ఓ హోటల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే... అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి దుకాణ యజమానిని మందలించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ... మాస్కులు ధరించాలని కోరారు. మాస్కులు ధరించని వారికి ఎమ్మెల్యేనే స్వయంగా మాస్కులు తొడిగారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎలాంటి వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పరిసరాలని శుభ్రం చేసుకోవాలన్నారు. నీటి నిల్వలు తొలగించి దోమలు రాకుండా చూసుకోవలని స్థానికులకు సూచించారు.