గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు. 66 స్థానాలకు 48 స్థానాలను గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితాల అనంతరం వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ గెలుపునకు కారణమని అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరిన్ని ప్రవేశపెడతామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో వరంగల్ పట్టణ రూపు రేఖలు మార్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పుర ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైకోర్టు నిర్ణయం తర్వాతే మేయర్, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక