ktr fires on rahul gandhi:పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్‌కు విచ్చేసిన మంత్రి కేటీఆర్... రైతు సంరక్షణ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖలపై హనుమకొండలో ఘాటుగా స్పందించారు. అసలు రాహుల్ హోదా ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గురించి ప్రజలకు బాగు తెలుసున్న కేటీఆర్.... రాహుల్ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఒక్క అవకాశం ఇమ్మంటున్నారని.. కానీ గతంలో పది అవకాశాలిచ్చినా... ఏమీ చేయలేకపోయారని ఆక్షేపించారు.
ktr on rahul: రిమోట్ కంట్రోల్ పాలన అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను అంతే తీవ్రంగా కేటీఆర్ తిప్పికొట్టారు. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా నిర్ణయాలు ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసని అన్నారు. మమ్మీ పార్టీ అధ్యక్షురాలైతే... డమ్మీ... ఉపన్యాసాలిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పోరాటంలోనే తమది ఏ టీం తప్ప.... బీ, సీ టీంగా ఉండే దౌర్భాగ్యం తమకు లేదని అన్నారు. కుంభకోణాల మయమైన కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే రాజులా వ్యవహరిస్తే... తమ గురించి కారుకూతలు కూసేవారిని ఉపేక్షించేవారా అని ప్రశ్నించారు.
'దేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు.... ఎవరైనా ముందుకు వస్తారా? కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పజెప్పారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివిన రాహుల్‌కు తెలంగాణలో తెరాస చేస్తున్న అభివృద్ధి ఏం తెలుసు? ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా క్రైసిస్ పార్టీ. దిల్లీ నుంచి గల్లీ వరకు... ఐక్యత లేని పార్టీ కాంగ్రెస్.' - కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ktr on congress: కాంగ్రెస్ ఇప్పుడు కాలం చెల్లిన పార్టీగా కేటీఆర్ అభివర్ణించారు. సొంత స్ధానంలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేరంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యవసాయానికి పాతర వేస్తే... తాము జాతర చేశామని.. అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాతే ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో కొత్తదనం లేదని చెప్పిందే చెప్పారని..... కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా రాహుల్ అనుకుంటే... ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్ అమలు చేయాలని పేర్కొన్నారు.
ktr satires on rahul:తప్పని పరిస్ధితుల్లోనే తెలంగాణ ఇచ్చారు తప్ప.... ప్రజల పైన ప్రేమతో కాదని కేటీఆర్ అన్నారు. వడ్లు కొనుగోలుపైన దేశమంతా ఒకటే విధానం ఉండాలని రాహుల్ ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దివాలా కోరు కాంగ్రెస్‌కు పాతరేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని... ఎట్టపరిస్ధితుల్లోనూ తన మాటలు విశ్వసించరన్నది రాహుల్ తెలుసుకోవాలని కేటీఆర్ అన్నారు.
మరోవైపు వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్క్... దేశానికే తలమానికంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే 18 నెలల్లో మరిన్ని యూనిట్లు పార్కులో నెలకొల్పనున్నారని తద్వారా... 20 వేలందికిపైగా ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ హనుమకొండలో అన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించడం ద్వారా ఎక్కువ కొలువులు వస్తాయని.... వరంగల్ అందులో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. మామ్ నూర్ విమానాశ్రయ పునరుద్ధరణ అంశాన్ని చర్చించామని ప్రస్తుతం ఉన్న రన్‌వేను విస్తరించేందుకు మరికొంత భూమి అవసరమవుతుందని కేటీఆర్ తెలిపారు. పెద్ద విమానాలు దిగేలా ఉండాలని ముఖ్యమంత్రి కూడా చెప్పారని తెలిపారు. టెర్మినల్ భవనం మార్చేందుకు....అవసరమైన అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: