కేంద్రం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నా... రాష్ట్రప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ పైలాన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
మీనమేషాలు లెక్కించింది...
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. వరద సాయం చేయడంలో కేంద్రం మీనమేషాలు లెక్కించిందని విమర్శించారు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఎలాంటి పాత్ర పోషించారో... తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అలాంటి పాత్ర పోషించారని మంత్రి అభివర్ణించారు. ఆయనకు తెలంగాణ ప్రజలు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు.
మేయర్ చరిత్రలో నిలుస్తారు...
వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ చరిత్రలో నిలుస్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ ఆవరణలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహంతో పాటు దీక్ష దివాస్ పైలాన్ ఏర్పాటు చేసి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని మంత్రి అభినందించారు.
ఇదీ చదవండి: విందులో పాల్గొన్న 40 మందికి అస్వస్థత..