రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వరంగల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం ఆరు గంటల నుంచే కూరగాయల మార్కెట్లు, ఇతర దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. పదిగంటల తర్వాత నగరంలోని ప్రధాన కూడళ్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హన్మకొండ చౌరాస్తా, నయీంనగర్, కేయూ కూడలి, కాజీపేట జంక్షన్, వరంగల్ ఎంజీఎం కూడలి తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలవుతోంది.
హన్మకొండ, వరంగల్ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. లాక్‌డౌన్ తొలిరోజు కావడం వల్ల పలుచోట్ల వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని.. అత్యవసర సేవల సిబ్బందిని అనుమతిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి పదిగంటల వరకూ రోడ్ల మీదకు వచ్చిన బస్సులు... తర్వాత డిపోలకే పరిమితమయ్యాయి.
ఇదీ చదవండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్