రాష్ట్రవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్‌లైన్ పరీక్ష జరుగుతోంది. రాష్ట్రంలో 11 నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. నిమిషం నిబంధన ఉండడంతో... ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు పూర్తైంది. మరొకటి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వరంగల్ నగరంలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా... 1036 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు లక్షా 10 వేల మంది ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.
తెలంగాణ, ఏపీలో...
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో జేఈఈ మెయిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిబంధనలు
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలో ఉండాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమకు కరోనా లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ గత నెల 23 నుంచి 26 వరకు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కూడా నిర్వహించి నాలుగింటిలో అత్యుత్తమ స్కోరు ఆధారంగా ర్యాంకు ఖరారు చేస్తారు.
ఇదీ చదవండి: నేటి నుంచి జేఈఈ మెయిన్ 2వ విడత ఆన్‌లైన్ పరీక్షలు