KTR Respond to Preethi Death: హనుమకొండ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్... రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మూడు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం... వేలేరు మండలం షోడషపల్లిలో జరిగిన సభలో మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు విపక్షాలకు కారణం దొరక్క.. కుటుంబ పాలన అంటున్నారని మండిపడ్డారు.
మతం, కులం పంచాయితీ లేని 4 కోట్ల మంది సభ్యులున్న తెలంగాణ వసుధైక కుటుంబం తమదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కరిని కుబేరుణ్ని చేసేందుకు ప్రధాని పేదలపై పన్నుల భారం మోపారని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగులైన రేవంత్‌రెడ్డి వంటివారు పాదయాత్రలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
'కేసీఆర్‌ను విమర్శించేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే. 60 లక్షల మంది రైతులున్న కుటుంబానికి రూ.60 వేల కోట్లు ఇచ్చాం. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష ఇస్తున్న మేనమామ... సీఎం కేసీఆర్. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణ నుంచే ఎంపికయ్యాయి. కొవిడ్ టీకాను మోదీ కనుగొన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటారు. మసీదులు తవ్వేందుకే బండి సంజయ్ ఎంపీ అయ్యారా?. మోదీ దేవుడని బండి సంజయ్ అంటారు.'-కేటీఆర్, ఐటీ మంత్రి
రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.1200 చేసినందుకు మోదీ దేవుడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రూ.70 ఉన్న లీటర్ పెట్రోల్‌ను రూ.110 చేసినందుకు మోదీ దేవుడా అని నిలదీశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని పక్కకుపెట్టిన మోదీ దేవుడా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అనంతరం ఆదివారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలేది లేదని స్పష్టం చేశారు.
'ప్రీతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అన్ని విధాలా ఆదుకుంటాం. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేది లేదు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలేది లేదు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల మెడికల్ విద్యార్థిని ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధించింది.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
సభలో మాట్లాడిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇతర నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. సభ ముగిసిన తర్వాత మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొండకండ్ల మండలం గిర్నితండాకు వెళ్లారు. తండాలోని ప్రీతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇవీ చదవండి: