Inavolu Jatara in Telangana: హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఉత్సవాల్లో.. భక్తులు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఆలయం ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో మునిగితేలింది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పంటచేలు, గొడ్డూ గోదాను చల్లగా చూడాలని మల్లన్నను వేడుకున్నారు.
ఎడ్లబండ్ల ప్రదర్శన..
జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. కొవిడ్ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మొక్కులు చెల్లించుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అశేషంగా తరలివచ్చిన భక్తుల రాకతో ఐనవోలు క్షేత్రం ఇల కైలాసాన్ని తలపించింది. ప్రత్యేక అలంకరణలు, విద్యుద్దీపాల అలంకరణలతో ఆలయ ప్రాంగణం మిరుమిట్లు గొలిపింది. సంక్రాంతి వేళ మూడు రోజుల పాటు ముచ్చటగా సాగిన జాతర.. ఎడ్లబండ్ల ప్రదర్శనతో వైభవంగా ముగిసింది.
రాపత్తు ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలందుకొన్న రాములోరికి.. వైభవంగా రథోత్సవం నిర్వహించారు. కలింగ మర్దిని అలంకారంలో స్వామి వారిని దర్శనమిచ్చారు. రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కరోనా నేపథ్యంలో రాపత్తు ఉత్సవాలను ఆలయంలోని చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. 23 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
భక్తుల మొక్కులు
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో బాహకారంలోని భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో జాతర ఘనంగా సాగింది. మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలతోపాటు... ఒగ్గు కళాకారుల కథలు, అగ్ని గుండాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. పెద్దఎత్తున భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మోతీమాత జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొగుడంపల్లి మండలం ఉప్పర్‌పల్లిలో ఆది, సోమవారాలు ఈ బంజార జాతర జరగనుంది. లంబాడి సంప్రదాయాలు, ఆచారాలకు అద్దం పట్టే జాతరకు... అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
ఇదీ చదవండి: Kanuma: కనుమ.. పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ