ఓటేయడం సమాజంలో ఉన్న వయోజనుల కనీస బాధ్యత. కానీ చాలామంది పౌరులు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఎన్నికల పోలింగ్ 60 శాతం నమోదవడం గగనంగా మారుతోంది. ఓటేసేందుకు ప్రత్యేకంగా సెలవు ఇచ్చినా...సెలవును వాడుకుంటున్నారు తప్ప...ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వరంగల్లో హిజ్రాలు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని 'జ్వాలా' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది హిజ్రాలు ఇందులో పాల్గొన్నారు. హిజ్రాలుగా జీవిస్తున్నా... తామంతా తప్పకుండా ఓటు వేస్తున్నామని మహిళలు, పురుషులు ఎందుకు ఓటేయరని ప్రశ్నించారు. 'అడుక్కున్నా....నోటుకు ఓటును అమ్ముకోం' అన్న ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.
ఎండను సైతం లెక్కచేయకుండా...
ఓటేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దని హిజ్రాలు చేపట్టిన ర్యాలీ అందరినీ ఆలోచింప చేసింది. సమాజ హితం కోసం మండుటెండను లెక్కచేయక ప్రదర్శన నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు 300 మంది హిజ్రాలతో ర్యాలీ చేపట్టారు. చట్టసభల్లో నేరగాళ్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని, మంచి నేతలను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు హిజ్రాలు.