కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు అమలు చేశారని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు కొనియాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్‌ను ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో జరిగిన ధూంధాంలో ప్రసంగించారు.
కరోనా కాలంలో ఎమ్మెల్యేలు,మంత్రులు, ఉద్యోగుల జీతాలు బంద్ చేసి రైతు బంధు ఇస్తున్న ముఖ్యమంత్రిని గెలిపించాలా.. రైతు చట్టాలు తొలగించాలని ఆందోళన చేస్తున్న రైతులపై కార్లు ఎక్కించిన పార్టీలకు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించుకోవాలని మంత్రి ఓటర్లకు సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులు ఏ కారణం వల్ల అయినా చనిపోతే 10 రోజుల్లో ఆర్థికసాయం అందుతోందని అన్నారు.
సీఎం కేసీఆర్ మా జీతాలు బంద్ చేసిండు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు జీతాలు బంద్ చేసైనా రైతు బంధు ఇచ్చిండు. మన సీఎం గారికి రైతుల సంక్షేమమే ముఖ్యం. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా రైతులకు ఏ లోటు రానివ్వలే. భాజపా రైతులకేం చేసిందో ఈటల రాజేందర్ గారు చెప్పాలి. కొత్త చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులను కార్లతో తొక్కి చంపేసిన ఘనత మీది.- హరీశ్ రావు, రాష్ట్రమంత్రి
ఇదీ చూడండి: 'దళితబంధుకు భాజపా వ్యతిరేకం కాదు.. అందరికీ అందే వరకూ పోరాటం'