Vinay Bhaskar responded to TSPSC question papers: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు లీకు కావడం చాలా బాధాకరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం సరి కాదని అన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందేందుకు కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
కొత్త జీవోను రద్దు చేయాలి: హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కల్యాణ మండపం పనులను ఆయన పరిశీలించారు. మండపానికి కేటాయించిన నిధులను కేంద్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని వివరించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కేంద్ర పురావస్తు శాఖ ఉగాది వేడుకలను అడ్డుకుంటుందని ఆరోపించారు. గతంలో ఎన్నడు లేని విధంగా రూ.25 వేలను చెల్లించి వేడుకలు జరుపుకోవాలని కేంద్రం జీవో తీసుకురావడం బాధాకరమని అన్నారు. నూతనంగా తీసుకొచ్చిన జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవో ఎత్తివేయని పక్షంలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.
"ప్రజా ఉద్యమం ద్వారా బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అవ్వడం చాలా బాధాకరం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదానికి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌పై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇది ముమ్మాటికి కక్ష పూరితంగా చేస్తున్నారు. కావాలనే రాజకీయ చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో 2 సంవత్సరాల్లో 17 ప్రభుత్వ పరీక్షలన్ని లీక్ అయ్యాయి. గుజరాత్లో 9 సంవత్సరాల్లో 13 పేపర్లు లీక్ అయ్యాయి. అసోంలో 15 పేపర్లు లీక్ అయ్యాయి. వీటన్నింటికి మీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించిందా?. వరంగల్‌లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇదంతా మంత్రి కేటీఆర్ కృషి. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. బీజేపీ ఇలాంటి వాటిని గుర్తించకుండా చౌకబారు రాజకీయాలు చేస్తోంది. పండగల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను." - దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
ఇవీ చదవండి: