Farmers Protest: హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఓఆర్‌ఆర్ కింద భూసేకరణలో తమ పొలాలు పోతున్నాయని పరకాల నియోజకవర్గంలోని మొగలిచర్ల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరిట తమ పంట భూములు లాక్కోవద్దంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డిని చుట్టుముట్టారు. పంటలు పండే భూములను ఇవ్వమంటూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని వెంటనే ల్యాండ్ పూలింగ్ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకు సమాచారం లేకుండా పంట భూములను సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా.. రైతులు వినిపించుకోకపోగా ఆందోళనకు దిగడంతో అసహనం వ్యక్తం చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనటంతో.. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
"తాతల కాలం నుంచి పంటలు పండించుకుంటూ బతుకుతున్న మా భూములను తీసుకుంటే.. మా పరిస్థితి రోడ్డున పడ్డట్టే. మా పిల్లల్ని ఎలా సాదుకోవాలి. ఉన్న కొంత భూమిని ఇవ్వమని మొండికేసినా.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో చుట్టూ ఉన్న స్థలాలు తీసుకుని.. మా భూముల్లోకి వెళ్లే వీల్లేకుండా చేస్తారు. ఏ దారి లేకుండా చేసి.. మా భూమి తీసుకోండని బతిమాలేలా చేస్తారు. ఇది చాలా అన్యాయం. అందుకే ఈ ల్యాండ్‌పూలింగ్‌ను వెంటనే ఆపేయాలి. లేకపోతే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ముందే హెచ్చరిస్తున్నారు. పాత మొగలిచర్లను చూడాల్సి వస్తది. దయచేసి.. ఈ ప్రక్రియను ఇప్పుడే ఆపండి." - మొగలిచర్ల రైతు..
ఇవీ చూడండి: