- జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన శ్రీనివాస్ కొడుకు ఆరో తరగతి. ఆన్‌లైన్ తరగతులు వింటూనే మధ్యలో కొన్ని ఆన్‌లైన్ ఆటలు ఆడేవాడు. దీంతో బ్యాంకు ఖాతాలో నుంచి అప్పుడప్పుడూ రూ. 4వేల నుంచి రూ.5 వేలు డెబిట్ అవుతున్నాయి. ఈ విషయం ఆరు నెలల వరకు శ్రీనివాస్ గ్రహించలేకపోయారు. మొత్తంగా రూ. 50 వేల వరకు బ్యాంకు నుంచి కోత పడ్డాక పోలీసులను ఆశ్రయిస్తే సైబర్ విభాగం సహకారంతో గేమ్స్ లింకులకు ఓటీపీ పంపితే దఫాలుగా డబ్బు పోయినట్టు తెలిసింది.
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యతండాకు చెందిన వెంకన్న ధాన్యం విక్రయించి బ్యాంకులో రూ. లక్ష వరకు దాచుకున్నాడు. విత్తనాలు కొందామని నగదు ఉపసంహరించుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో రూ. 600 మాత్రమే ఉండడంతో కంగుతిన్నారు.ఖాతా పరిశీలించగా నాలుగు రోజుల పరిధిలో రూ. లక్ష బదిలీ అయినట్టు వచ్చింది. పోలీసులు ఆరా తీస్తే 9వ తరగతి చదువుతున్న వెంకన్న కొడుకు ఆన్‌లైన్ తరగతులు వింటూ మధ్యలో ఆటలాడటంతో వెంకన్న డబ్బు పోగొట్టుకున్నారు.
- హన్మకొండకు చెందిన రవికుమార్ కూతురు ఆన్‌లైన్ తరగతులు వింటూనే మధ్యలో కొన్ని ఆటలు ఆడేది. ఓసారి ఓటీపీ రాగానే మొబైల్‌లో ఎంటర్ చేయడంతో రూ 5 వేలు బ్యాంకు ఖాతా నుంచి వెళ్లిపోయాయి.
- భూపాలపల్లి పట్టణంలో ఇటీవల ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. పిల్లలు ఆన్‌లైన్ తరగతి పూర్తయ్యాక మొబైల్‌కు ఒక లింకు వచ్చింది. దాన్ని క్లిక్ చేయగానే మొబైల్‌కు వచ్చిన పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలని సందేశం వచ్చింది. పిల్లలు అలాగే చేయడంతో రూ.10వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి.
పిల్లలు తెలిసీ తెలియక మొబైల్‌లో వస్తున్న లింకులను తెరవడం, ఓటీపీలు వెల్లడిస్తుండడంతో తల్లిదండ్రుల ఖాతాల నుంచి నగదు గుల్ల అవుతోంది. తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి ఇలా వేలు, లక్షల రూపాయలు కోత పడుతున్నాయి. నగదు మొత్తం భారీగా కోల్పోతే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చిన్నమొత్తంలో పోగొట్టుకుంటే మాత్రం మిన్నకుండిపోతున్నారు. కరోనా విజృంభణ తర్వాత ఆన్‌లైన్ తరగతులు వినేందుకు పిల్లలు మొబైల్ ఫోన్లను అధికంగా వాడుతున్నారు. రోజూ కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు ఫోన్‌లో పాఠాలు వింటున్నారు. మధ్యలో విశ్రాంతి దొరికితే రకరకాల ఆన్‌లైన్ ఆటలు ఆడుతున్నారు. నిరంతరం పర్యవేక్షించాలంటే తల్లిదండ్రులకు కూడా కుదరడం లేదు. ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు ఆటల రూపంలో వల వేసి డబ్బు లాగేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లు పిల్లలకు ఆటను వ్యసనంగా చేసి పైసలు దండుకుంటున్నాయి. ఆన్‌లైన్ ఆటలో ఒక దశ దాటితే రూ.వందో రెండొందలో వస్తాయని రావడంతో పిల్లలు ఆడుతున్నారు. అన్నట్టుగానే డబ్బులు పంపిస్తున్నారు. మరిన్ని డబ్బులు రావాలంటే తాము పంపిన ఓటీపీ చెప్పాలని పిల్లలకు వల వేస్తున్నారు. ఓటీపీ నొక్కడంతో తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వేల నుంచి రూ.లక్షల్లో లాగేసుకుంటున్నారు.
అనేక రకాలుగా...
ఇక కొన్ని వీడియో గేములు ఆడేందుకు ఆన్‌లైన్‌లో భారీగా లాగేస్తున్నారు. లెవెల్స్ పెరిగే కొద్దీ ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసేందుకు కొన్ని లింకులు రాగానే పిల్లలు తర్వాత లెవెల్‌కు వెళ్లేందుకు తల్లిదండ్రులను అడక్కుండానే లింకులను నొక్కుతున్నారు. వీరు ఉపయోగించే మొబైల్ బ్యాంకుతో అనుసంధానమై ఉన్నా, ఇందులో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం తదితర చెల్లింపు యాప్‌లు బ్యాంకులతో లింకై ఉన్నా ఆన్‌లైన్‌లో వచ్చే వివరాలను పిల్లలు మొబైల్‌లో ఎంటర్ చేస్తే ఖాతా నుంచి నగదు వెళ్లిపోతోంది.
పెరిగిన నేరాలు..
కొన్నేళ్లుగా సైబర్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో చూస్తే 2018లో 66 సైబర్ నేరాలు నమోదవ్వగా, 2019లో వీటి సంఖ్య 78కి చేరింది. 2020లో ఏకంగా 113 కాగా, ఈ ఏడాది ఇప్పటికే 75 వరకు ఉన్నాయని వరంగల్ సైబర్ క్రైం విభాగం బాధ్యతలు చూస్తున్న ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి చెబుతున్నారు.
ఇవీ జాగ్రత్తలు
- ఆన్‌లైన్ తరగతుల కోసం వినియోగించే చరవాణిలో బ్యాంకుతో లింకు ఉన్న పేమెంట్ యాప్‌లు ఉండకూడదు.
- ఆటల్లో భాగంగా యాప్‌ల నుంచి వచ్చే లింకులను తెరవకుండా చూడాలి.
- ఈ తరహా మోసాలపై పిల్లలకు అవగాహన కల్పించి ఓటీపీ చెప్పకుండా నియంత్రించాలి.
- పిల్లలు తరగతులు విన్న తర్వాత ఆన్‌లైన్ ఆటలు ఆడకుండా మరో వ్యాపకంలోకి తల్లిదండ్రులు తీసుకెళ్లాలి.